ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన మాతృమూర్తిని కలిశారు. ఉత్తరాఖండ్‌లోని తమ పూర్వీకుల గ్రామానికి చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా తన గురువు మహంత్ వైద్యనాథ్‌ని తలచుకుని ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (uttar pradesh cm) యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) దాదాపు ఐదేళ్ల తర్వాత తన మాతృమూర్తి సావిత్రి దేవిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. తన పూర్వీకుల గ్రామమైన ఉత్తరాఖండ్‌లోని (uttarakhand) పౌరీకి యూపీ సీఎం వెళ్లారు. అక్కడే ఉన్న తల్లి సావిత్రీ దేవిని కలుసుకున్నారు. అలాగే బుధవారం తన కుటుంబ వేడుకకు యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, దాదాపు 28 ఏళ్ల తర్వాత తన కుటుంబంలో జరిగే వేడుకకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకావడం ఇదే మొదటిసారి. కరోనా లాక్‌డౌన్ సమయంలో యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియలకు సైతం యూపీ సీఎం వెళ్లలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో తండ్రి కడసారి చూపునకు కూడా ఆయన దూరమయ్యారు. ‘‘తన తండ్రి చివరి రోజుల్లో పక్కనే ఉండాలని తాను భావించా.. కానీ కరోనా మహమ్మారి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని 23 కోట్ల మంది ప్రజలను కాపాడడం తన బాధ్యత అని అందుకే నాన్నతో ఉండలేకపోయానని యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో ఒక ప్రకటనలో తెలిపారు యోగి ఆదిత్యనాథ్.
కుటుంబాన్ని కలవడానికి ముందు సొంత జిల్లా పౌరీ-గర్వాల్‌లోని (pauri garhwal) మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువు మహంత్ వైద్యనాథ్ విగ్రహాన్ని యూపీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి భావోద్వేగానికి లోనయ్యారు. 1940 తర్వాత తాను జన్మించిన స్థలంలో తన ఆధ్యాత్మిక గురువు విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు.
అంతకుముందు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌కు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (pushkar singh dhami) స్వాగతం పలికారు. అలాగే యోగి స్వగ్రామంలోనూ గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. యోగి రాకతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఉత్సాహం నెలకొంది. ఆదిత్యనాథ్ రాక విషయం తెలుసుకున్న స్థానికులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
