Asianet News TeluguAsianet News Telugu

రాముడి అవతారంగా యోగి ఆదిత్యానాథ్‌కు పూజలు.. నిలువెత్తు విగ్రహంతో యూపీలో మందిరం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు అయోధ్యలో ఓ కోవెల నిర్మించారు. రాముడి మందిరం నిర్మించిన వారికి గుడి కట్టిస్తానని 2015లో వాగ్దానం చేసిన ఓ అయోధ్య నివాసి అదే జిల్లాలో యోగి ఆదిత్యానాథ్‌కు ఈ గుడి కట్టారు. గుడిలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు.

UP CM Yogi Adityanath life size statue and temple built in Uttar pradesh
Author
First Published Sep 19, 2022, 6:00 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఆయనను కారణ జన్ముడిగా కీర్తిస్తారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని కొందరైతే ఆయనను రాముడి మరో అవతారంగా కొలుస్తున్నారు. యోగి ఆదిత్యానాథుడికి ఏకంగా ఓ మందిరమే నిర్మించారు. అందులో నిలువెత్తు యోగి ఆదిత్యానాథ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయోధ్య జిల్లాలోనే ఈ కోవెల నిర్మించడం గమనార్హం.

రాముడిలాగే.. యోగి ఆదిత్యానాథ్ విగ్రహానికి కూడా బాణాలు, ధనస్సు అస్త్రాలను పెట్టారు. ఆ గుడిలో యోగి ఆదిత్యానాథ్‌కు ప్రతి రోజు రెండు సార్లు పూజలు చేస్తున్నారు. ఉదయం,  సాయంత్రం ఈ పూజలు ఉంటాయి. పూజ తర్వాత భక్తులకు ప్రసాదాన్ని కూడా పంచిపెడుతున్నారు

ఈ గుడి అయోధ్య జిల్లా భరత్ కుండ్ సమీపంలోని పుర్వా గ్రామంలో నిర్మించారు. రాముడి వనవాసానికి ముందు ఆయన సోదరుడు భరతుడు ఇక్కడే (భరత్ కుండ్) రాముడిని వీడ్కోలు ఇచ్చినట్టు చెబుతుంటారు.

ఈ ఆలయాన్ని అయోధ్య నివాసి ప్రభాకర్ మౌర్య నిర్మించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వారికి గుడి కట్టించి పూజిస్తానని 2015లోనే ఆయన ప్రమాణం చేశారు. ఆ కోరిక తీరుతుండటంతో ఆదిత్యానాథ్‌కు ఆయన కోవెల కట్టించారు.

రాముడి కోసం పరితపించిన యోగి ఆదిత్యానాథ్‌కు తాను ప్రతి రోజు ఆయన విగ్రహం ముందు నిలబడి పూజలు చేస్తానని మౌర్య తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 8.5 లక్షలు ఖర్చు అయినట్టు వివరించారు. యోగి ఆదిత్యానాథ్ విగ్రహాన్ని రాజస్తాన్‌లో చేయించి తీసుకువచ్చినట్టు తెలిపారు.

గతేడాది బీజేపీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి పూణెలో ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. మయూర్ ముండే అనే వ్యక్తి ప్రధాని మోడీ ఆలయాన్ని నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios