రాబోయే పండుగలకు భద్రత : సీఎం యోగి కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని భద్రత, పరిశుభ్రత, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ ఆయన ఇచ్చిన ఆదేశాలేంటంటే..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే పండగలను ప్రజలు ఆనందంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పండగల కోసం చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించేందుకు సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో పరిశుభ్రత పాటిస్తూ ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకునేలా చూడాలని అధికారులకు సీఎం యోగి ఆదేశించారు.
సీఎం యోగి నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని డివిజన్ల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ (జోన్), అన్ని నగరాల పోలీస్ కమిషనర్లు, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని విభాగాల అదనపు ప్రధాన కార్యదర్శులు,ప్రధాన కార్యదర్శుల నుండి పండుగల దృష్ట్యా వారి విభాగంలో చేసిన ఏర్పాట్ల గురించి సమాచారం సేకరించారు.
ముఖ్యమంత్రి జారీ చేసిన కీలక ఆదేశాలు :
● మెరుగైన శాంతి భద్రతలు, అన్ని వర్గాల నుండి లభిస్తున్న సహకారం వల్లనే ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రంలో అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, దుర్గాపూజ, దసరా, శ్రావణ మేళాలు, ఈద్, బక్రీద్, బారావఫాత్, మొహర్రం వంటి పండుగలన్నీ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ టీం వర్క్, ప్రజల సహకారం ఇలాగే కొనసాగాలి.
● రాబోయే రోజుల్లో ధన త్రయోదశి, అయోధ్య దీపోత్సవం, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్, దేవ్ ఉఠాన ఏకాదశి, వారణాసి దేవ్ దీపావళి, ఛాట్ పూజ వంటి ప్రత్యేక పండుగలు ఉన్నాయి. వీటితో పాటు అయోధ్యలో పంచకోసి, 14 కోసి పరిక్రమ, కార్తీక పౌర్ణమి స్నానం వంటి మేళాలు కూడా ఈ సమయంలోనే జరుగుతాయి. శాంతి, భద్రత, సుపరిపాలన దృష్ట్యా ఇది సున్నితమైన సమయం. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోండి. పండుగల సమయంలో పోలీసులు, పరిపాలనతో సహా మొత్తం బృందాలు 24×7 అప్రమత్తంగా ఉండాలి.
● అన్ని పండుగలు ప్రశాంతంగా, సామరస్యంగా జరిగేలా స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకోవాలి. గత నెల రోజుల కార్యకలాపాలను సమీక్షించి, గుర్తించిన అల్లరిమూకలను, అరాచక శక్తులను అదుపులోకి తీసుకోవాలి. వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఆనందోత్సాహాల సమయం, ఇందులో అల్లర్లు ఆమోదయోగ్యం కాదు. అరాచక శక్తులకు, అల్లరిమూకలకు వారి భాషలోనే సమాధానం చెప్పడం సముచితం.
● సోషల్ మీడియాపై నిఘా పెంచాలి. ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టే బృందం ఉండాలి. నకిలీ ఖాతాలు సృష్టించి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారిపై, అసత్య ప్రచారం,నకిలీ వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
● దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి, కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన చేసే సంప్రదాయం ఉంది. విగ్రహ ప్రతిష్టాపన చేసే సంస్థలు, కమిటీలతో సంప్రదించాలి. సున్నిత ప్రాంతాల్లో తగినంత పోలీసు బలగాలను మోహరించాలి. దీపావళికి ముందు వివిధ మత పెద్దలతో, శాంతి కమిటీలతో సంప్రదింపులు జరపాలి.
● ధనత్రయోదశి,దీపావళి సందర్భంగా ప్రతి ఆదాయ వర్గానికి చెందిన కుటుంబాలు ఏదో ఒకటి కొనుగోలు చేస్తాయి. మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీస్ బాస్ లు వ్యాపారుల వేధింపుల గురించి ఎక్కడి నుండీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి. వారి సహకారం తీసుకోవాలి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
● దీపావళికి సంబంధించిన బాణాసంచా దుకాణాలు, గోదాములు జనావాసాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. బాణసంచా కొనుగోలు, అమ్మకాలు జరిగే చోట తగినంత ఫైర్ సెప్టీ ఏర్పాటు చేయాలి. పోలీసు బలగాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బాణసంచా దుకాణాలు ఖాళీ ప్రదేశాల్లో ఉండాలి. వీటికి లైసెన్స్, ఎన్ఓసీ సకాలంలో జారీ చేయాలి. అక్రమ బాణాసంచా నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
● ఉజ్వల పథకం లబ్ధిదారులందరికీ దీపావళికి ముందు ఉచిత గ్యాస్ సిలిండర్ అందేలా చూసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలి.
● పండుగలు ఆనందించే సమయం. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. కుటిల ప్రయత్నంతో కొందరు అల్లరిమూకలు ఇతర మతాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు, అలాంటి వారిపై నిఘా పెట్టాలి. ప్రతి నగరానికి అవసరమైన ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలి. మార్కెట్లకు వచ్చేవారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా చూసుకోవాలి. సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలి. ప్రతిరోజూ సాయంత్రం పోలీసు బలగాలు పరేడ్ చేయాలి. పీఆర్వీ 112 యాక్టివ్‌గా ఉండాలి.
● చిన్న చిన్న సంఘటనలు నిర్లక్ష్యం వల్ల పెద్ద వివాదాలుగా మారవచ్చు. అందువల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. తక్షణ చర్యలు, సంభాషణలు అవాంఛనీయ సంఘటనలను నివారించడంలో సహాయపడతాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి. సున్నితమైన కేసుల్లో ఉన్నతాధికారులు నాయకత్వం వహించాలి.
● అయోధ్య దీపోత్సవం ఈ ఏడాది అక్టోబర్ 30న ఘనంగా జరగనుంది. భవ్య, దివ్య, నవ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఇదే తొలి దీపోత్సవం. ఈసారి దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అదేవిధంగా నవంబర్ 15న వారణాసిలో దేవ్ దీపావళి జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాల్లో భద్రత, జన నియంత్రణ చర్యలు మరింత మెరుగ్గా ఉండాలి. దీపోత్సవం, దేవ్ దీపావళి ప్రాముఖ్యతకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి.
● ఛాట్ పూజను 'పరిశుభ్రత, భద్రత' ప్రమాణాలతో నిర్వహించాలి. ఛాట్ పూజ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత ఉండేలా నగరపాలక, పంచాయతీరాజ్ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ నదులు, జలాశయాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. నదులు, జలాశయాల ఘాట్లను శుభ్రం చేయాలి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
● రాబోయే అక్టోబర్ 28 నుండి నవంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలి. విద్యుత్ సంస్థ ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
● అత్యవసర వైద్య సేవలు, ట్రామా సేవలు నిరంతరాయంగా కొనసాగించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి.
● కల్తీ సామాన్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిది. పండుగల దృష్ట్యా ఆహార పదార్థాల తనిఖీలను ముమ్మరం చేయాలి. అయితే తనిఖీల పేరుతో వేధింపులు ఉండకూడదు.
● పండుగల సమయంలో ప్రజల రాకపోకలు పెరగడం సహజం. చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళతారు. అందువల్ల రవాణా శాఖ గ్రామీణ మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచాలి. పాత బస్సులను రోడ్లపై నడపకూడదు.
● స్టేషన్, సర్కిల్, జిల్లా, రేంజ్, జోన్, డివిజన్ స్థాయిల్లో ఉన్న ఉన్నతాధికారులు తమ తమ ప్రాంతాల్లో ప్రముఖ వ్యక్తులతో సంప్రదింపులు జరపాలి. శాంతియుత వాతావరణం నెలకొనేలా మీడియా సహకారం తీసుకోవాలి.
● నేపాల్‌తో సరిహద్దును పంచుకునే జిల్లాల సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిఘాను మరింత మెరుగుపరచాలి.