Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: ‘80 శాతం వర్సెస్ 20 శాతం’ వ్యాఖ్యలపై యూపీ సీఎం క్లారిటీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాక మీదకు వస్తున్నది. ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ప్రజలకు, 20 శాతం ప్రజలకు మధ్యే పోటీ ఉన్నదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. 20 శాతం ప్రజలు ఎవరంటే.. రామజన్మభూమిని వ్యతిరేకించేవారని, మాఫియా, టెర్రరిస్టులకు సానుభూతిపరులుగా ఉన్నవారని తెలిపారు.
 

UP CM yogi adityanath gave clarity on 80 vs 20 remarks
Author
Lucknow, First Published Jan 11, 2022, 4:34 AM IST

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యక్ష ర్యాలీల్లో కన్నా.. మీడియా హౌజుల్లో సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం Yodi Adityanath.. 80 వర్సెస్ 20 శాతం వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోని 80 శాతానికి, మిగతా 20 శాతానికి మధ్య పోటీ అని అన్నారు. 80 శాతం జనాభా సానుకూల దృక్పథంతో ముందుకు కదిలే వారైతే.. 20 శాతం జనాభా ఎప్పుడూ ప్రతీదాన్ని వ్యతిరేకిస్తుంటారని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో హిందువులు(Hindus), ముస్లిం(Muslims)ల జనాభా శాతం అటూ ఇటూగా ఇవే శాతాలతో ఉన్నది. దీంతో చర్చ వేడెక్కింది. తాజాగా, ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.

80 శాతం వర్సెస్ 20 శాతం సూత్రీకరణ వాస్తవంలో నిజమైనదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఎన్నికలు 80-20 గానే ఉంటాయని వివరించారు. మార్చి 10వ తేదీన ఫలితాలు రానివ్వండి.. అప్పుడే తెలిసిపోతుందని తెలిపారు. 80 శాతం జనాభా, 20 శాతం జనాభాపై క్లారిటీ అడగ్గా సమాధానం ఇచ్చారు. ఆ 20 శాతం జనాభా ఎవరంటే.. రామ జన్మభూమి, కాశీ విశ్వనాథ ధామాన్ని, మధుర అభివృద్ధిని వ్యతిరేకించేవారని అన్నారు. అదే 20 శాతం మంది మాఫియా, టెర్రరిస్టు సానుభూతిపరులు అని ఆరోపించారు.

ఇదే ఇంటర్వ్యూలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై ఎలాంటి సంశయాలు లేవని, ఎవరు సీఎం అభ్యర్థినో ప్రజలందరికీ తెలుసు అని వివరించారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని తెలిపారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది బీజేపీ పార్టీనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన గొప్ప కార్యం లేదా.. ఎన్నికల్లో గెలిపించే అభివృద్ధి పని ఏమని అడిగితే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరించడం అని వివరించారు. అలాగే, రైతుల్లోనే బీజేపీ పై ఆగ్రహం లేదని అన్నారు. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత తమపై వారికి ఎలాంటి ఆగ్రహం లేదన్నారు. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులకు జరిగిందని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలువలేని రైతు నేత రాకేశ్ టికాయత్ బీజేపీకి సమస్య కాదని స్పష్టం చేశారు.

శాసన సభా గడువు ముగుస్తున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అసంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేయడం లేదని వివరించింది. నిన్ననే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలన ప్రకటించింది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్  రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు షెడ్యూల్‌లలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఒక్క యూపీలో మాత్రమే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కరోనా కేసుల నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios