ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రామాలయ ప్రతిష్ట తర్వాత ఈ దీపావళి చారిత్రాత్మకమైనది. అయోధ్యలో గొప్ప దీపోత్సవం జరుగుతుంది.
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ శ్రీరాముడు వారికి సుఖసంతోషాలను, శ్రేయస్సును ప్రసాదించాలని యోగి కోరుకున్నారు.
ఇవాళ (గురువారం) దీపావళి పండగను పురస్కరించుకుని సీఎం యోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా దీపావళి పండగ భారతదేశ సంస్కృతిలో చాలా ముఖ్యమైనదని అన్నారు. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి రావడం...రామరాజ్యాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రజలు ఆనందంతో ఈ పండగను జరుపుకున్నారని అన్నారు. ఇలా వేల సంవత్సరాల క్రితం ప్రజలు దీపాలతో ఇళ్లను అలంకరించుకుని ఈ పండుగను జరుపుకోవడం ప్రారంభించారు.. అప్పటినుండి ప్రతిఏటా ఈ పండగను జరుపుకుంటున్నామని అన్నారు..
అయితే ఈ సంవత్సరం దీపావళి చారిత్రాత్మకమైనదని, అపూర్వమైనదని ముఖ్యమంత్రి అన్నారు. 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన నివాసంలో కొలువయ్యారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన కొత్త రామాలయంలో లెక్కలేనన్ని దీపాలు వెలిగించామన్నారు. కేవలం రామాలయంలోనే కాదు అయోధ్య మొత్తం దీపకాంతులతో వెలిగిపోయిందని యోగి అన్నారు.
మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో ఉండటం మనందరి అదృష్టమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో దీపావళి వేడుకలను 'దీపోత్సవం'గా నిర్వహిస్తూ, ప్రపంచానికి అయోధ్య గొప్పతనాన్ని చాటిచెప్తుందని తెలిపారు.