యూపీ యువతకు శుభవార్త...ఉద్యోగాల భర్తీపై సీఎం యోగి కీలక సమావేశం
ఉత్తర ప్రదేశ్ యువతకు యోగి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని అధికారిక నివాసంలో గురువారం ఉద్యోగాల కల్పనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, సంస్థల ప్రతినిధులు ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రణాళికలను సీఎంకు వివరించారు. ప్రతి శాఖలోనూ కార్యాచరణ ప్రణాళికతో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని వేగవంతం చేయడానికి నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు.
వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై సీఎం సమీక్ష
రాష్ట్ర యువతకు వారి అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా సకాలంలో ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్థానిక వనరులను ఉపయోగించి ఎక్కువ ఉద్యోగావకాశాలు సృష్టించాలన్నారు. అలాగే యువతను వ్యాపారం వైపు ప్రోత్సహించడానికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను మరింత పెంచాలని అధికారులకు ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్‌ను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం సెక్టార్ల వారీగా కృషి చేస్తోంది. 10 సెక్టార్లుగా విభజించి పనులు చేపడుతున్నారు.... అన్ని శాఖలను ఈ సెక్టార్లతో అనుసంధానించారు. ఈ పనులను ప్రతి మూడు నెలలకోసారి సీఎం స్వయంగా సమీక్షిస్తున్నారు. ప్రతి నెలకోసారి మంత్రులు సమీక్షిస్తున్నారు. 15 రోజులకోసారి శాఖాధిపతి సమీక్షిస్తున్నారు.
వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ పనులను సీఎం డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు సీఎం డాష్‌బోర్డ్‌ను పరిశీలించి ప్రభుత్వ పనితీరును తెలుసుకోవాలని కోరారు. వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పనకు నిపుణుల సహకారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
యుపీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి
వైద్యం, విద్య, పర్యాటకం, నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని... వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ప్రయాగరాజ్ మహా కుంభమేళా-2025 రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు మంచి అవకాశమని చెప్పారు. మహా కుంభమేళా ధర్మం, ఆధ్యాత్మికత, సంస్కృతికి సంగమం. దీనికి ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మహా కుంభమేళాలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, జ్ఞానం, సాంకేతికతపై చర్చలు జరగాలన్నారు. దీనివల్ల ఉద్యోగాల కల్పన, వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభిస్తుందన్నారు. ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, టెలిమెడిసిన్‌ను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. యుపీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, కొత్త రూట్లు ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు.