యోగి మార్క్ పాలన ... ఇకపై మంత్రులకే ఆ బాధ్యత : యూపీ కెబినెట్ నిర్ణయం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన స్టైల్లో పాలన సాగిస్తున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ బేటీలో మంత్రులకు కొత్తగా బాధ్యతలు అప్పగించారు... చివరకు ఆయన కూడా మంత్రులందరితో కలిసి బాధ్యతలు స్వీకరించారు.
లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిన్న (గురువారం) జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ బాధ్యతలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలనే ఈ చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన కీలక ఆదేశాలు :
- సెప్టెంబర్ 17న ప్రధాని పుట్టినరోజు సందర్భంగా చేపట్టే స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి.
- జిల్లా బాధ్యతలు నిర్వర్తించే మంత్రులు నెలకు ఒక్కసారైనా 24 గంటలు ఆ జిల్లాలోనే గడపాలి.
- ప్రతి నెలా జిల్లా పరిస్థితులపై నివేదిక సమర్పించాలి.
- ప్రముఖులు, రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించాలి.
- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. భూమికి సంబంధించిన సమస్యలు, ఇతర శాఖలకు చెందిన సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించాలి.
- గోశాలలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేయాలి.
- స్థానికంగా పర్యాటక అభివృద్ధికి అవకాశాలను అన్వేషించాలి.
- రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
- ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను తనిఖీ చేయాలి. ఆయుష్మాన్ భారత్ కార్డులు, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది హాజరు తీరును పరిశీలించాలి. అంగన్వాడీ కేంద్రాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకాల అమలు తీరును పరిశీలించాలి.