ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై బహుజన సమాజ్ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ను నాలుగు భాగాలుగా విభజిస్తుందని ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. బలియా జిల్లా బల్తారా రోడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గాజీపూర్ ఎంపీ అన్సారీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విరుచుకు పడ్డారు. 

సీఎం యోగి తనపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం ద్వారా మిస్టర్ క్లీన్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని అన్సారీ ఆరోపించారు. బీజేపీ ద్వేష పూరిత రాజకీయాలు చేయడం వల్ల సామాజిక సామరస్యాన్ని నాశనం చేస్తూ ఐదు దశాబ్దాలపాటు దేశాన్ని వెనుకకు నెట్టి వేశారని అన్సారీ దుయ్యబట్టారు. మాఫియాపై తన ప్రభుత్వం బుల్డోజర్లను తరలిస్తుందని చెప్పే సీఎం యోగి..ఆయనపై, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాలపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకుంటున్నారని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఎంపీ అన్సారీ విమర్శించారు.