న్యూఢిల్లీ: క్లాస్ రూమ్ లో సీటు విషయంలో గొడవ ఓ విద్యార్ధి ప్రాణాలు తీసింది.ఈ ఘటన  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు చోటు చేసుకొంది.

14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారు. క్లాస్ రూమ్ లో కూర్చొనే సీటు విషయంలో ఇద్దరి మధ్య బుధవారం నాడు గొడవ చోటు చేసుకొంది.

క్లాస్ రూమ్ లో గొడవ కారణంగా ఓ విద్యార్ధి రగిలిపోయాడు. సైన్యంలో పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్ రివాల్వర్ ను ఓ విద్యార్ధి దొంగిలించి గురువారం నాడు స్కూల్ కు వచ్చాడు.

సీటు విషయంలో తనతో గొడవ పడిన మరో విద్యార్ధిపై గురువారం నాడు క్లాస్ రూమ్ లోనే కాల్చి చంపాడు. ఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్టుగా పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు.

ఆ విద్యార్ధి బ్యాగులో కంట్రీమేడ్ పిస్టల్ ను కూడ స్వాధీనం చేసుకొన్నారు. గురువారం నాడు ఉదయం రెండు పీరియడ్లు ముగిసిన తర్వాత 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.

సహచర విద్యార్ధి తల, ఛాతీ, కడుపు భాగంతో నిందితుడు కాల్పులు జరిపాడు. దీంతో సంఘటన స్థలంలోనే అతను కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు.

సహచర విద్యార్ధిపై కాల్పులు జరిపిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోని తన తరగతి నుండి కిందకు వచ్చాడు. తనను పట్టుకొనేందుకు వస్తున్న ఇతరులను భయపట్టేందుకు అతను గాలిలోకి కాల్పులు జరిపాడు. కొందరు టీచర్లు ధైర్యం చేసి ఆ బాలుడిని పట్టుకొన్నారు. అతడి నుండి తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమయంలో కూడ ఆ విద్యార్ధి టీచర్లతో పోరాటం చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

వెంటనే ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు స్కూల్ కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.