వారణాసి: వారణాసిలో నూతన వధూవరులు దండలు మార్చుకున్నారు. అయితే, పూలదండలు కాకుండా వారు ఉల్లి, ఎల్లిపాయ దండలు మార్చుకున్నారు. ఆ దండలను ఒకరి మెడలో మరొకరు వేశారు. మిన్నంటిన ఉల్లిధరలను వ్యతిరేకిస్తూ వారు ఈ పనిచేసి ఉంటారు. 

వధూవరులకు అతిథులు కూడా ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు. ఉల్లి ధరలు గత నెల నుంచి మిన్నంటుతున్నాయని, దాంతో ప్రజలు ఉల్లిని బంగారం కన్నా ఎక్కువ విలువైందిగా చూస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ నేత కమాల్ పటేల్ అన్నారు. ఉల్లిధర కిలోకు రూ.120 పలుకుతోందని, దాంతో వధూవరులు ఉల్లిదండలు మార్చుకున్నారని ఆయన అన్నారు. 

ఉల్లి ధరలపై నిరసనగానే వధూవరులు ఆ పనిచేశారని మరో సమాజ్ వాదీ పార్టీ నేత సత్య ప్రకాశ్ అన్నారు .ఉల్లి ధరలపై తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. వధూవరులకు ఇది చారిత్రాత్మక సంఘటన అని ఆయన అన్నారు.