UP assembly election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈ ఎన్నిక‌ల‌ను అన్ని ప్ర‌ధాన పార్టీలు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డానికి సిద్ధ‌మైంది.  

UP assembly election 2022: దేశంలో ఈ ఏడాది ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం శ‌నివార‌మే షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌డంతో.. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అన్ని రాజ‌కీయ పార్టీలు బ‌రిలో నిలిపే అభ్యర్థులు ఎంపిక‌లో నిమ‌గ్న‌మ‌య్యాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అధికార పార్టీ బీజేపీ మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. దీని కోసం ప్ర‌చారంలో వేగం పెంచింది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల (Assembly Election 2022) బ‌రిలో నిలిపే వారిని ఎంపిక చేయ‌డం కోసం బీజేపీ అధిష్ఠానం క‌స‌ర‌త్తుల‌ను ముమ్మ‌రం చేసింది. దీని కోసం యూపీ బీజేపీ సీనియర్ నేతలను ఢిల్లీకి ర‌మ్మ‌ని క‌బురు పంపింది. మంగ‌ళ‌వారం నాడు యూపీ బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. అయితే, దీనికి కంటే ముందు సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు లక్నోలో యూపీ బీజేపీ ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలో టిక్కెట్ల కేటాయింపు గురించి చ‌ర్చించనున్నారు. ఈ స‌మావేశంలో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను మంగ‌ళ‌వారం నాడు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ముందుకు తీసుకెళ్ల‌నున్నారు. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం టిక్కెట్ల పంపిణీపై తుది నిర్ణ‌యం తీసుకోనుంది. 

ఢిల్లీకి వెళ్లే యూపీ బీజేపీ సీనియ‌ర్ నేత‌లు వీరే ! 

యూపీ ఎన్నిక‌ల (Assembly Election 2022) నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యం గురించి చ‌ర్చించ‌డాని రాష్ట్ర కీల‌క నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచింది బీజేపీ. వారిలో యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్, డాక్టర్ దినేష్ శర్మ, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ లు ఉన్నారు. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరుకు వీరు మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ నేతలంతా బీజేపీ హైకమాండ్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్థులు, టికెట్ల కేటాయింపుల గురించి చర్చించనున్నారు.

పశ్చిమ యూపీలో బీజేపీకి గట్టి దెబ్బ ! 

ఇదిలావుండ‌గా, ప‌లు ప్రాంతాల్లో (Assembly Election 2022) ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. పశ్చిమ యూపీలోని బదౌన్ జిల్లాలోని బిల్సీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే శర్మ.. స‌మాజ్‌వాది పార్టీలో చేరారు. అలాగే, సహరాన్‌పూర్‌లో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ ఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు.