Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : ఒకే నియోజ‌కవ‌ర్గం నుంచి బీజేపీ టికెట్ కోసం భార్యాభ‌ర్త‌ల పోటీ..

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన ఇంటి పోరు నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు భార్యాభర్తలు పోటీ చేయాలని భావిస్తున్నారు. అది కూడా ఒకే పోటీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించడం గమనార్హం. వీరిద్దరు అధికార బీజేపీలో ముఖ్యమైన నాయకులు. 

up assembly election 2022: Husband and wife contest for BJP ticket from the same constituency.
Author
Lucknow, First Published Jan 19, 2022, 12:47 PM IST

ఎన్నిక‌ల్లో ఎన్నో విచిత్రాలు జ‌రుగుతుంటాయి. మ‌రెన్నో చిత్రాలు వెలుగులోకి వ‌స్తుంటాయి. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి  కుటుంబంలోని ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు, తండ్రి కొడుకులు, తోడ‌ళ్లులు పోటీ చేస్తుండ‌టం చూస్తుంటాం. కానీ బ‌హుషా ఇప్పుడు మ‌నం ఇప్పుడు మాట్లాడుకోబోయే ర‌క‌మైన పోటీ ఎప్పుడు చూసి ఉండ‌రు. అదేంటంటే  ఒకే కుటుంబంలోని భార్యా భ‌ర్త‌లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నుకోవ‌డం. అది కూడా ఒకే పార్టీ టికెట్ నుంచే బ‌రిలో నిల‌వానుకోవ‌డం. ఇప్పుడు ఈ విష‌యం యావ‌త్ దేశం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఇంటి పోరు జ‌ర‌గ‌నుంది. ల‌క్నోలోని ఒకే సీటు కోసం ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు పోటీ ప‌డుతున్నారు. లక్నోలోని సరోజినీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇద్ద‌రు దంప‌తులు క‌లిసి బీజేపీలో టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీర‌ద్ద‌రు ప్ర‌స్తుత అధికార బీజేపీలో ముఖ్య‌మైన స్థానాల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న భార్య యోగి ఆధిత్య‌నాథ్ ప్ర‌భుత్వంలో ఉన్న మంత్రి స్వాతి సింగ్ కాగా.. మ‌రొక‌రు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ద‌యాశంక‌ర్ సింగ్. 

ప్ర‌స్తుత‌ మంత్రి స్వాతి సింగ్ సరోజినీ నగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె రెండో సారి అదే స్థానం నుంచి టికెట్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. నిజానికి స్వాతి రాజకీయ రంగ ప్రవేశం ఓ విధంగా అనుకోకుండా జ‌రిగింది. ఆమె భర్త దయా శంకర్ సింగ్ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై 2016 సంవ‌త్స‌రంలో కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అత‌ను వివాదంలో చిక్కుకున్నాడు. ద‌యా శంక‌ర్ సింగ్ కు వ్య‌తిరేకంగా బీఎస్పీ పెద్దఎత్తున ఆందోళ‌న‌ను నిర్వ‌హించింది. దీంతో బీజేపీ డిఫెన్స్ లో ప‌డింది. దీంతో పార్టీ నుంచి అత‌డిని స‌స్పెండ్ చేసింది. అనంత‌రం ఆయ‌న అరెస్టు అయ్యారు. కొన్ని వారాల త‌రువాత బీజేపీ తన మహిళా విభాగం అధ్య‌క్షురాలిగా దయాశంకర్ భార్య స్వాతి సింగ్‌ను నియ‌మించుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఆమె ఒక సాధార‌ణ గృహిణిలా మాత్ర‌మే ఉన్నారు. రాజ‌కీయాల్లో ఆమెకు ఎలాంటి అనుభ‌వం లేదు. 

స్వాతిసింగ్ రాజ‌కీయంగా కొంత అనుభ‌వం నేర్చుకొని 2017ఎన్నికల్లో సరోజినీ నగర్ నుంచి గెలిచారు. ఆమె యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా కొన‌సాగారు. ఆమె మంత్రిగా ఎంపికైన వెంట‌నే ఓ బీర్ బార్ ను ప్రారంభించి వివాదంలో చిక్కుకుంది. అదే స‌మ‌యంలో ద‌యాశంక‌ర్ సింగ్ స‌స్పెన్ష‌న్ ను బీజేపీ మెళ్ల‌గా ఎత్తేసింది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత‌డు యూపీ బీజేపీ ఉపాధ్య‌క్షుడుగా నియమితుడ‌య్యారు. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితిపై ద‌యాశంక‌ర్ సింగ్ మాట్లాడారు."వివాదాల కారణంగా నాకు చివరిసారి టిక్కెట్ రాలేదు, కానీ నేను, నా అనుచ‌రులు స్వాతి గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ విష‌యంలో పార్టీ స్ప‌ష్ట‌త‌నివ్వాలిష అని అన్నారు. మ‌రో వైపు ఈ విష‌యంపై మీడియాతో మాట్లాడ‌టానికి స్వాతి సింగ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

ఇదిలా ఉండ‌గా భార్యాభర్తలిద్దరూ తమ టికెట్ కోసం పార్టీలోని వివిధ నేతల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ బీజేపీ నాయ‌కుడు ఇండియ‌న్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. “స్వాతి సింగ్ పోస్టర్‌లలో దయాశంకర్ ఫోటో లేదు, అలాగే ద‌యాశంక‌ర్ పోస్ట‌ర్ ల‌లో స్వాతి సింగ్ ఫొటోలు లేవు. అయితే ఈ విష‌యంలో అంతిమంగా పార్టీ నిర్ణ‌యం తీసుకుంటుంది’’ అని తెలిపారు. స్వాతి సింగ్‌కు టికెట్ నిరాకరించినట్లయితే అది మహిళా ఓటర్లలో తప్పుడు సందేశాన్ని పంపే అవకాశం ఉంది. ఈ విషయంలో యూపీ బీజేపీ సందిగ్ధంలో పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios