లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. రెండు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

లక్నో-హర్దాయో రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

రెండు బస్సులు మితీమీరిన వేగంతో ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎదురెదురుగా వస్తున్న బస్సులు ఢీకొన్నాయి. హర్దాయో నుండి లక్నోకు ఒక బస్సు వెళ్తోంది. మరో బస్సు లక్నో నుండి హర్దాయో కి వెళ్తున్నట్టుగా అధికారులు చెప్పారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.

ఈ ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కమిటిని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోనే ఈ నివేదికను ఇవ్వాలని రవాణా ఆదేశాలు జారీ చేసింది.