రోజు రోజుకీ దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. దిశ హత్యోదంతం, ఉన్నావ్ అత్యాచార బాధితురాలు సజీవ దహనం ఘటనల తర్వాత... ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటుచేసుకుంటున్నాయి. నేరస్థులకు వేస్తున్న శిక్షలను చూసి భయపడిపోయి.. నేరాలు తగ్గాల్సిందిపోయి... మరింత పెరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతిపై 25ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతి గర్భం దాల్చిందనే విషయం తెలియడంతో... కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బేతియా ప్రాంతానికి చెందిన యువతి(19) కి కొంత కాలం క్రితం తండ్రి చనిపోయాడు. ఇద్దరు సోదరులు కుటుంబ పోషణ కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో... యువతి తల్లితో కలిసి నివసిస్తోంది. ఒక రోజు కుమార్తె తో కలిసి పొలం పనులు చేస్తోంది. అయితే... ఆ సమయంలో తల్లి.. వంట చేయడానికి ఇంటికి వెళ్లగా.. యువతి అక్కడే పనిచేస్తోంది.

ఆమె తల్లి లేని సమయాన్ని అదనుగా చేసుకున్న అదే ప్రాంతానికి  చెందిన అర్మన్(25) అనే యువకుడు యువతిని చెరకు తోటల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యువతి ఈ విషయాన్ని తల్లికి తెలియజేసింది. అయితే... అతనిని ఎదురించే శక్తి ఆమెకు లేకపోవడంతో.. మౌనంగా ఉండిపోయింది. దీనిని అవకాశంగా మార్చుకున్న అర్మన్.. యువతిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో  యువతి గర్భందాల్చింది. ఈ విషయం తెలిసిని యువతి తల్లి.. తన కుమార్తెను పెళ్లి చేసుకోమని కోరింది. తమ పెద్ద  కుమారుడు ఇంటకి వస్తున్నాడని.. పంచాయతీ పెద్దలను కలిసి... ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని ఆమె అనుకుంది. తమ కుమార్తెకు పెళ్లి జరుగుతుందని వారంతా సంతోషపడే లోపు.. అర్మన్.. యువతిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు.

దీంతో.. యువతికి 70శాతం గాయాలయ్యాయి. ఉదయం ఆమెపై దాడి జరిగింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ బాధితురాలి కుటుంబానికి రూ.3వేలకు పైగా డిమాండ్ చేశారు. అంత చెల్లించుకునే స్థితిలో తాము లేవని వాళ్లు వేడుకున్నా అంగీకరించకపోవడం బాధాకరం ఈ క్రమంలో బాధితురాలు కన్నుమూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అర్మన్ ని అరెస్టు చేశారు.