లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా రవాణా వ్యవస్థ స్తంభించింది పోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఆంక్షలు  ఎత్తివేస్తూ దేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగా ఆన్‌లాక్ 4లో మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల తొలి వారంలో మెట్రోలు పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో మెట్రో ప్రయాణికుల కోసం నూతన విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.

ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులు సమావేశమయ్యారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ఫ్లాట్ ఫాంలలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తా చెదారం పడేయడం, ఖాళీగా ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.

దీనితో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకరు నిత్యం మెట్రో రైలు స్టేషన్‌లో ఉంటూ, కోవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తారని సమాచారం. ఇదే  సమయంలో నిబంధనలు అతిక్రమించే వారిపై భారీగా జరిమానాలు విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది.