ముంబై: మహారాష్ట్రలో ఓ వ్యాపారిని కాల్చి చంపిన ఇద్దరు దుండగులు... అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫోన్ చేశారు.మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్‌పూర్ పట్టణంలోని సూరజ్ బహురియా బొగ్గు వ్యాపారం చేస్తున్నాడు. 

శనివారం నాడు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై కారులో బామినీ వైపు వెళ్తున్న సూరజ్  ఓ హోటల్ వద్ద ఆగాడు. ఇంతలో వెనుక నుండి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు డ్రైవర్ సీట్లో ఉన్న సూరజ్ ను కారు గ్లాసు తీయమని కోరారు.

ఆయన గ్లాసు ఓపెన్ చేయలేదు. దీంతో దుండగులు తుపాకీతో కారు గ్లాసుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి.  ఈ విషయం తెలిసిన పోలీసులు సూరజ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. 

దుండగులు బీటీఎస్ చౌక్ కు చేరుకొని తామే కాల్పులు జరిపామని పోలీసులకు ఫోన్ చేశారు. వచ్చి అరెస్ట్ చేయాలని కూడ కోరారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవాళ సూరజ్ పుట్టిన రోజు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు.  పాత కక్షలతోనే సూరజ్ ను  హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.