కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం బీహార్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. హెలికాఫ్టర్‌లో పాట్నా విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సమయంలో హెలికాఫ్టర్ బ్లేడ్లు ఓ నిర్మాణానికి వున్న ఇనుప వైర్లకు తగలడంతో విరిగిపోయాయి. ఈ ఘటనపై రవిశంకర్ ప్రసాద్ కార్యాలయం స్పందించింది. మంత్రి క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేసింది.

అందులో ప్రయాణిస్తున్న వారంతా దిగి వెళ్లిపోయిన తర్వాత హెలికాఫ్టర్ బ్లేడ్లు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మంగల్ పాండే, సంజయ్ ఝాలతో కలిసి రవిశంకర్ ప్రసాద్ తిరిగి పాట్నా చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

అంతకుముందు మధుబని జిల్లా లాఖా నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో రవిశంకర్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. మరోసారి బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కడతారని ఆయన ట్వీట్ చేశారు.