కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1946 జూలై 5న బీహార్‌లోని ఖగారియా జిల్లా షాహర్‌బన్నీలో ఓ దళిత కుటుంబంలో జన్మించిన పాశ్వాన్ కోసి కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం పాట్నా యూనివర్సిటీలో పీజీ చేశారు. 1969లో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు.

అనంతరం 1969లో తొలిసారి సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ ప్రస్థానంలో బీహార్‌తో పాటు దేశంలోని ప్రముఖ దళిత నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 

8 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. గుండెపోటుతో తన తండ్రి మరణించినట్లుగా పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ఇటీవలే ఢిల్లీలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు పాశ్వాన్. లోక్‌ జన్‌శక్తి పార్టీకి రాంవిలాస్ పాశ్వాన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.