కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. కేరళపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యను ప్రస్తావిస్తూ కేరళ తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. ప్రవీణ్ నెట్టారు హంతకులు ఉపయోగించిన బైక్ నెంబర్ ప్లేట్ కేరళలో రిజిస్టర్ అయిందని వివరించారు.
బెంగళూరు: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన తరుణంలో కేరళ తీవ్రవాదులకు స్వర్గధామం అవుతున్నదని బీజేపీ విమర్శలు చేసింది. కేరళలో స్వేచ్ఛగా తిరిగే తీవ్రవాదులు ఇతర రాష్ట్రాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నారని ఆరోపించింది.
ప్రవీణ్ నెట్టారు హంతకులు కేరళలో నమోదైన నంబర్ ప్లేట్ బైక్‌ను వినియోగించినట్టు ఆధారాలు చెబుతున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కాబట్టి, నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడంలో కేరళ ప్రభుత్వం కర్ణాటకతో సహకరించాలని సూచించారు. వారిని అరెస్టు చేయడానికి బదులు రక్షించే పనులు చేయవద్దని కేరళపై కామెంట్లు చేశారు.
పినరయి విజయన్ సారథ్యంలో కేరళ తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ శక్తులకు చెందిన కొన్ని తీవ్రవాద మూకలూ పొరుగు రాష్ట్రాల్లో అరాచకాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి కేరళలో రక్షణ లభిస్తున్నదని, ఇది వారికి నేరాలకు పాల్పడటానికి పురికొల్పుతున్నదని తెలిపారు.
కర్ణాటకలో ఇలాంటి ఉగ్రవాద మూకలు ఉండే చాన్సే లేదని, వారికి తెలుసు కర్ణాటక ప్రభుత్వం వారిని వెతికి తుదముట్టిస్తుందని.. కాబట్టి అవి వాటికి అనుకూలంగా ఉన్న కేరళలో తలదాచుకుంటున్నాయని తెలిపారు. కేరళలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే 22 మంది హత్య జరిగిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా,
కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. 23 ఏళ్ల ముస్లిం యువకుడిని కొందరు దుండగులు దారుణం హతమార్చారు. ఈ జిల్లా ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ యువజన విభాగం యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్యతో ఈ జిల్లా అట్టుడికిపోతున్నది. ఇదే తరుణంలో ఓ ముస్లిం యువకుడి హత్య జరగడం మరింత కలకలం రేపింది.
మృతుడిని ఫాజిల్‌గా పోలీసులు గుర్తించారు. మంగళూరు సూరత్‌కల్ ఏరియాలో పాజిల్‌పై దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. ముగ్గురు నుంచి నలుగురు దుండగులు ముఖాలకు ముసుగులు వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎన్ శశి కుమార్ వెల్లడించారు. సూరత్‌కల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని, అదే స్టేషన్‌లో ఓ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏరియాను చాలా సెన్సిటివ్ ఏరియాగా భావిస్తున్నామని తెలిపారు. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీ యూత్ వింగ్ నేత 32 ఏళ్ల ప్రవీణ్ నెట్టారును కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి కత్తులతో నరికి చంపారు. ప్రవీణ్ నెట్టారు వారి బ్రాయిలర్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లుతుండగా ఆయనను చంపేశారు. ఈ ఘటనలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వారిద్దరిని గురువారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
