తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మణికందన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మణికందన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి రాగానే 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని మణికందన్ హెచ్చరికలు జారీ చేయడంపై.. తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మణికందన్‌పై కేసు నమోదు కాగా.. ఆయన వ్యాఖ్యలను బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి సరైనది కాదని పేర్కొంటున్నారు. 

అయితే తాజాగా ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త‌ను షేర్ చేసిన ఆయన.. ఇది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని వర్ణిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజనీతిజ్ఞులుగా ఉన్న నాయకులు ఉన్న రోజు నుంచి చాలా దూరంగా ఉందని విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ క్రూరమైన, అబద్దాలు చెప్పే వ్యక్తులతో నిండిపోయిందని మండిపడ్డారు. 

సిగ్గులేని జోకర్ నాయకుడు ఉన్న ఆ పార్టీ.. విదేశీ శక్తులు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరుస్తున్నారని.. అదే సమయంలో ఓ నేత న్యాయమూర్తుల నాలుకను కత్తిరించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. 

Scroll to load tweet…


అసలేం జరిగిందంటే..?
2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరును పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికే ఎసరు పెట్టాయి. మోడీ ఇంటి పేరున్న వారిని, ఒక వర్గాన్ని రాహుల్ గాంధీ అవమానించారని గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఆ కేసు విచారించి రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష వేసింది. పార్లమెంటులో సభ్యత్వం కోల్పోవడానికి కనీసం రెండేళ్ల శిక్ష ఉంటే సరిపోతుంది. దీంతో ఆ నిబంధన మేరకు రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోయారు.

రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై వేసిన అనర్హత వేటును నిరసిస్తూ తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ వింగ్ నిరసనలు చేసింది. ఆ నిరసనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ మణికందన్ మాట్లాడారు. మార్చి 23న సూరత్ కోర్టు న్యాయమూర్తి రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిందని గుర్తు చేశారు. ‘జస్టిస్ హెచ్ వర్మ వినండి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నాలుక కోసేస్తాం’ అని మణికందన్ అన్నారు. ఇక, మూడు సెక్షన్ల కింద మణికందన్‌పై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.