Rajeev Chandrasekhar: ఇటీవల కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ .. ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులకు గణేశ్ విగ్రహాలను బహూకరించారు.
Rajeev Chandrasekhar: కేరళలోని ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి లిజిన్ లాల్ తరుపున ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. బుధవారం నాడు ఆయన పుత్తుపల్లిలో పర్యటించి..పలు బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని మోడీ నాయకత్వం జరిగిన ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలకు గణేశ్ విగ్రహాలను బహూకరించారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీస్ బేరర్లతో కలిసి మంత్రి భోజనం చేసి తిరుగు ప్రయాణమయ్యారు.
ఇటీవల కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్రవ్యాప్త నామజప ఊరేగింపులో.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన స్పీకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళలతో సహా భారీ సంఖ్యలో భక్తులు డిమాండ్ చేశారు.
కానీ నామ జప ఊరేగింపుకు సంబంధించి ఎన్‌ఎస్‌ఎస్ ఉపాధ్యక్షుడు సంగీత్ కుమార్, ఇతర నాయకులపై ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ చర్య సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలకు గణేశ విగ్రహాన్ని కానుకగా అందించడం గమనార్హం. శబరిమల సమస్య నుంచి పద్మనాభస్వామి దేవాలయం వరకు అన్ని విషయాల్లో భక్తుల మనోభావాలు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదన కేంద్ర మంత్రి సమర్ధించారు.
అసలేం జరిగిందంటే..?
సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందడం కంటే హిందూ పురాణాల గురించి పిల్లలకు తెలియజేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ ఆరోపించారు. "హిందూ మతంలో ప్రారంభం నుండి ప్లాస్టిక్ సర్జరీ, ఇన్ఫెర్టిలిటీ థెరపీ, ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని కాషాయవాదులు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను స్కూల్లో చదువుతున్న సమయంలో రైట్ బ్రదర్స్ విమానాన్ని రూపొందించారు. ప్రస్తుతం పుష్పక విమానం అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు." కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
