డీఎంకె, కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. కావేరి నీటి విడుదల విషయంలో తమిళనాడు సీఎం మోడీకి లేఖ రాసిన విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: డీఎంకె, కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ద్వేషించే ఉద్దేశ్యంతో ఏకైక లక్ష్యంతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు. విపక్ష పార్టీల కూటమి ఇండియాలో ఈ రెండు పార్టీలు భాగస్వామ్యులు అనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తమ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తమ మధ్య సమస్యను పరిష్కరించుకోలేని వారు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రెండు పార్టీల తీరును తప్పుబట్టారు.
కావేరి నీటిని విడుదల చేయించేందుకు చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ రాసిన లేఖను కూడ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన పోస్టుకు జత చేశారు.
కావేరి నీటి సరఫరా, మేఘాదాత్ డ్యామ్ విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ విషయమై సుప్రీంకోర్టు, కావేరీ ట్రిబ్యునల్ చేసిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘించిందని తమిళనాడు ఆరోపిస్తుంది. కావేరి డెల్టాలో ఉన్న పంటను కాపాడుకొనేందుకు అవసరమైన నీటిని విడుదల చేయించాలని ప్రధాని మోడీని స్టాలిన్ కోరారు.
