అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారితే కొడతానని హెచ్చరించారు. పుణేలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు.. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్ ప్రాంతంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు... ఎందుకంటే ఎవరైనా కులం గురించి మాట్లాడితే నా చేతిలో చావు దెబ్బలు తింటారని ఆయన వ్యాఖ్యానించారు.

పేదలకు సాయం చేయడం.. భగవంతుడికి సేవ చేయడంతోనే సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిది ఎక్కువ కులం.. మరొకరిది తక్కువ కులం అనే భేదం తొలగిపోవాలని కోరుకున్నారు. సమాజంలో ప్రజల మధ్య వ్యత్యాసాలను రూపు మాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.