ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈవీల్లో లోపాలను పరిశీలించి నాణ్యతాపరమైన మార్గదర్శకాల రూపకల్పనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఆ రిపోర్టు ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని, వాటిని ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

న్యూఢిల్లీ: పర్యావరణ హితాన్ని కాంక్షించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నది. కానీ, కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతుండటం కలకలం రేపింది. ఉన్నట్టుండి కొన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోవడం, వాటి వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతున్నది. అంతేకాదు, ఈ ఘటనల్లో ప్రాణాలూ పోవడం తీవ్ర ఆందోళనలు కలిగించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

గడిచిన రెండు నెలల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించిన అవాంఛనీయ ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వివరించారు. మరెంతో మంది ఈ ఘటనల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ఘటనలను పరిశీలించడానికి ఓ ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే, ఈ ప్రమాదాల నివారణకు సూచనలు, అవసరమైన చర్యలనూ ఆ కమిటీ ప్రతిపాదిస్తుందని పేర్కొన్నారు.

ఈ కమిటీ నివేదిక ఆధారంగా లోపాలు ఉన్న కంపెనీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని వివరించారు. ఏ కంపెనీ అయినా ఈ ఆదేశాలను అమలు చేయకపోతే వారికి భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, లోపాలు ఉన్న వాహనాలు అన్నింటినీ వెనక్కి తీసుకోవాలనే ఆదేశాలనీ ఇష్యూ చేస్తామని స్పష్టం చేశారు.

Scroll to load tweet…

ఇప్పటికే లోపాలు బయట పడ్డ వాహనాల బ్యాచ్‌లను ముందస్తుగానే రీకాల్ చేసుకోవచ్చునని కంపెనీలకు ఆయన సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంతో తాము ప్రతి ప్రయాణికుడు భద్రతకు కట్టుబడి ఉన్నామని వివరించారు.

ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఈవీలను తయారు చేసే వారికి భారీ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.

గత కొద్ది రోజుల క్రితం Ola ఎలక్ట్రిక్, Okinawa ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, ఈ సంఘటనలు మరచిపోకముందే చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి.

చెన్నైలో మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్కూటర్ వీడియోను ‘ది ఎకనామిక్ టైమ్స్’ కు చెందిన సుమంత్ బెనర్జీ ట్వీట్ చేశారు. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. సుమంత్ బెనర్జీ ట్వీట్ చేసిన వీడియోలో రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు రంగు ప్యూరీ ఈవీ ద్విచక్రవాహనంలో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు నాలుగు రోజుల్లో 4 జరిగాయని సుమంత్ బెనర్జీ పేర్కొన్నారు.