VK Singh: 'పాకిస్థాన్ ను ఏకాకిని చేయడమే పరిష్కారం'
VK Singh: పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ను కట్టడి చేయాలంటే.. ఆ దేశంపై ఒత్తిడి తీసుకరావాలని, పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలని పేర్కొన్నారు.

VK Singh: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు సీనియర్ ర్యాంకింగ్ అధికారులతో సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగు దేశం పాకిస్థాన్ ను ఏకాకిని చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్య తీసుకునేలా వారిపై ఒత్తిడి పెంచాలని అన్నారు.
బీజేపీ నిర్వహిస్తున్న జన్ ఆశీర్వాద యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇండోర్ చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై విరుచుకుపడిన వీకే సింగ్ భారత కూటమిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. కశ్మీర్ ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ ప్రధాని మోదీని కొనియాడారు.
పాకిస్థాన్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. ఆ దేశం ఆకలితో అలమటిస్తున్నా..ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే అలవాటును మాత్రం వదులుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మన దేశాన్ని ముక్కలు చేయాలని భావిస్తోందనీ, భారత్‌లో భీభత్సాన్ని వ్యాప్తి చేస్తూనే ఉందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు భారత సైన్యం, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయనీ, కానీ, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం కొనసాగేలా పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
I.N.D.I.A. కూటమిపై టార్గెట్
వి.కె.సింగ్ మాట్లాడుతూ I.N.D.I.A. కూటమి వాళ్లంతా తమ లోపాలను దాచుకోవడానికి ‘గాత్‌బంధన్’ అనే పేరు పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో సైన్యం కనీస అవసరాలను కూడా తీర్చలేదని, కానీ 2014లో ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందని, సైనికులకు బులెట్ ప్రూప్ జాకెట్లను అందించారని అన్నారు. కాంగ్రెస్ ఏనాడూ అమరవీరుల కోసం క్యాండిల్ మార్చ్ కూడా చేయలేదనీ, వారు నేడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? అని ఘాటుగా నిలదీశారు. పాకిస్తాన్ తన సొంత ప్రజల గురించి పట్టించుకోకుండా.. ఇతర దేశాలలో ఉగ్రవాదాన్ని విస్తరించాలని పట్టుబట్టే దేశం అని వీకే సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అడపాదడపా ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని అన్నారు.అయితే.. నిన్న జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరమని అన్నారు.
కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసు మేజర్, డిఎస్‌పితో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి కమాండ్‌గా ఉన్న భారత ఆర్మీ కల్నల్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో ప్రాణ త్యాగం చేసిన సీనియర్ భద్రతా దళ సిబ్బందిని కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్,DSP హుమాయున్ భట్‌లుగా గుర్తించారు. మంగళవారం రాజౌరి జిల్లాలోని నార్లా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు హతమార్చాయి. బుధవారం ప్రారంభమైన కాల్పులు గురువారం వరకు కొనసాగాయి.