కొటియా గ్రామాలు ఒడిషావే .. ఏపీ పోలీసులకు ఇక్కడేం పని, ‘‘గో బ్యాంక్ ఆంధ్ర’’ : ధర్మేంద్ర ప్రధాన్
కోటియా గ్రామాల వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటియా గ్రామ పంచాయతీలోని మొత్తం 28 గ్రామాలు ఒడిషాకు చెందినవేనని.. ఒడిషాను తక్షణం ఏపీ పోలీసులు విడిచిపెట్టాలని ఆయన అల్టీమేటం జారీ చేశారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీ-ఒడిషా బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. కోరాపుట్‌లోని వివాదాస్పద కోటియా ప్రాంతంలోకి పొరుగున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రవేశించరాదని ప్రధాన్ హెచ్చరించారు. కోటియాలో పర్యటించిన ఆయన ‘‘ఉత్కళ్ దిబస’’ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. కోటియా గ్రామ పంచాయతీలోని మొత్తం 28 గ్రామాలు ఒడిషాకు చెందినవేనన్నారు. ఒడిషాను తక్షణం ఏపీ పోలీసులు విడిచిపెట్టాలని ఆయన అల్టీమేటం జారీ చేశారు. మీరందరూ ఇక్కడ ఎందుకు వున్నారు.. కోటియా పంచాయతీ ఒడిషాకు చెందినదన్న ఆయన సీఐ రోహిణి పాత్రోను వెనక్కి వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. గో బ్యాక్ ఆంధ్ర అంటూ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం ‘బందే ఉత్కళ జననీ’ జెండాను ఎగురవేశారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో 34 గ్రామాల్లో సుమారు 4 వేల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఈ గిరిజనులకు ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల ఓటు హక్కుంది. ఇక్కడ దాదాపుగా 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.
Also REad: కొటియా గ్రామాల్లో ఉద్రిక్తత: ఏపీ అధికారులను అడ్డుకొన్న ఒడిశా పోలీసులు
అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీంకోర్ట్ ఓ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, న్యాయవాదులు ఉన్నారు.కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.