కరోనా వైరస్‌కు తోడు దేశంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. దీని వల్ల గత పదిరోజులుగా మనదేశంలో లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర పాడి, పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ ద్వారా సూచించారు. ప్రజలంతా మాంసం, గుడ్లను తినేటపుడు బాగా ఉడికించి తినాలని.. భయపడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు.

Also Read:రోడ్లపై నేలరాలిన వందల పక్షులు .. తెనాలిలో బర్డ్ ఫ్లూ కలకలం..?

పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని గిరిరాజ్ ట్వీట్‌ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బర్డ్‌ఫ్లూను గుర్తించారన్న నివేదికను సైతం ఆయన విడుదల చేశారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా యూరోపియన్‌ దేశాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. నెదర్లాండ్స్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూను కనుగొన్నామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) వెల్లడించింది.

బర్డ్ ఫ్లూ కారణంగా ఫ్రాన్స్‌లో సుమారు ఆరు లక్షలకు పైగా పౌల్ట్రీ పక్షులను అధికారులు వధించారు. జర్మనీలో 62 వేల టర్కీ బాతులను చంపారు. కాగా, బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి మనుషుల మధ్య సంక్రమణ ప్రారంభం కాలేదన్నారు.