కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మధ్యాహ్నం ఆయన జాదవ్‌పూర్  విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్ధి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో  పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయనను ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్ధి సంఘాల నేతలు చుట్టుముట్టి  ‘‘ గో బ్యాక్ ’’ నినాదాలు చేశారు. సుప్రియోను వర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించేది లేదని తేగేసి చెప్పారు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు సైతం కిందపడిపోయాయి. చివరికి పటిష్ట బందోబస్తు మధ్య బాబుల్ సుప్రియోను ఆడిటోరియంలోకి తీసుకెళ్లారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదని.. విద్యార్ధుల  ప్రవర్తన  తనను  తీవ్రంగా బాధించిందన్నారు.. నిరసనకారులు విద్యార్ధులను రెచ్చగొట్టి తొక్కిసలాట నిర్వహించారని సుప్రియో మండిపడ్డారు.

సమావేశం ముగిసిన అనంతరం తిరిగి బయటకు వెళ్లే సమయంలోనూ బాబుల్ సుప్రియో ఇదే  విధమైన ఆందోళనను ఎదుర్కొన్నారు.

విద్యార్ధులు తోపులాటలో ఆయన జట్టు పట్టుకుని, చొక్కా చించివేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి  గవర్నర్‌కు నివేదిక అందిస్తామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ వెల్లడించారు.