Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులపై కేంద్ర మంత్రి ఫైర్.. గది తలుపులు వేసి కుర్చీతో దాడి.. కేసు నమోదు.. ఎక్కడంటే?

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్టు పోలీసు కేసు నమోదైంది. రివ్యూ మీటింగ్‌ కోసం పిలిచిన కేంద్ర మంత్రి.. ఆయన తెమ్మన్న ఓ ఫైల్ వెంట తీసుకుపోనందుకు సీరియస్ అయ్యాడని, తాము భేటీ అయిన గదికి లోపల నుంచి గడి పెట్టి తమపై కుర్చీతో దాడిద చేశాడని ఉద్యోగులు ఇద్దరు ఆరోపించారు. తాము ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డామని, తర్వాత పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు.
 

union minister attacks state govt officials
Author
Bhubaneswar, First Published Jan 22, 2022, 2:22 PM IST

భువనేశ్వర్: ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్ర మంత్రి దాడికి దిగారు. కుర్చీ(Chair)తో వారిపై విరుచుకుపడ్డాడు. దీంతో ఓ ఉద్యోగి చేయి విరిగింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా, కేంద్ర మంత్రి మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను అసలు దాడే(Attack) చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన ఒడిశా(Odisha)లో చోటుచేసుకుంది. ఒడిశా ప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర జల్ శక్తి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి.

మయూర్‌బంజ్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిశ్వేశ్వర్ తుడు(Union MInister Bishweswar Tudu).. డిస్ట్రిక్ట్ ప్లానింగ్, మానిటరింగ్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ అశ్విని కుమార్ మల్లిక్, అసిస్టెంట్ డైరెక్టర్ దేబాశిశ్ మోహపాత్రాలతో సమావేశం అయ్యాడు. మంత్రి బిశ్వేశ్వర్ తుడు కార్యాలయంలోనే వీరు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అవసరమైన కొన్ని ఫైల్స్‌ను ఆ ఉద్యోగులు వెంట తీసుకురాలేదని మంత్రి సీరియస్ అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోపంతోనే ఇద్దరు ఉద్యోగులను దాడి చేసినట్టు ఆరోపించారు.

రివ్యూ సమావేశానికి మంత్రి పిలువగానే ఆయన కార్యాలయానికి వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. వారు తమ తప్పును వెతికి దాడి చేయాలనే వైఖరి ప్రదర్శించారని ఆరోపించారు. తాము ప్రోటోకాల్స్ అతిక్రమించామని సీరియస్ అయ్యారని వివరించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ కోసం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారిక ఫైల్స్‌ను పార్టీ కార్యాలయానికి తీసుకురావడం సమంజసం కాదని కేంద్ర మంత్రికి వివరించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఎంపీల్యాడ్స్‌కు సంబంధించిన ఫైల్స్ తీసుకురాలేనందుకు మంత్రి ఆగ్రహానికి లోనయ్యారని పేర్కొన్నారు. తమను దూషించాడని, కుర్చీలతో దాడికి దిగాడని ఆరోపణలు చేశారు. కుర్చీలతో తమపై దాడి చేశాడని, ఎలాగోలా తాము అక్కడి నుంచి తప్పించుకుని వచ్చామని వివరించారు. ఈ ఫిర్యాదుతో  బరిపాద పోలీసు స్టేషన్‌లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన ప్రతిష్టను దెబ్బ తీయాలనే కుట్రతోనే వారు ఫిర్యాదు చేశారని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. వారిద్దరూ తన వద్దకు వచ్చారని, సమావేశమయ్యారని వివరించారు. సుమారు అరగంటపాటు భేటీ సాగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 7 కోట్ల ఎంపీల్యాడ్ నిధులను ఎలా ఖర్చు పెట్టారో వివరించే ఫైల్స్ వెంట తేవాల్సిందిగా వారిని కోరాను అని చెప్పారు. వారు తేకపోగా.. ఇప్పుడు విచిత్ర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక వేళ తాను దాడి చేసి ఉంటే.. పార్టీ కార్యాలయం నుంచి అంత సులువుగా బయటకు వెళ్లేవారా? అని తిరిగి ప్రశ్నించారు.

అయితే, ఓ ఉద్యోగి చేతికి పెద్ద పట్టీతో హాస్పిటల్ బెడ్‌పై ఉన్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios