Anurag Thakur: యూఏఈ పర్యటనలో ఉన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దుబాయ్‌ ఎక్స్‌పో 2020ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలోని ఇండియన్‌ పెవిలియన్‌కు చేరుకున్న ఆయన బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

Anurag Thakur:  దుబాయ్‌లో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పోలో ఓ ఆస‌క్తికర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ వేదిక‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి స్టెప్ వేశారు. హిందీ పాపులర్ అయిన మల్హరి అనే సాంగ్‌కి నటుడు రణ్‌వీర్‌సింగ్ తో కలిసి డ్యాన్స్ చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దుబాయ్ లో నిర్వ‌హించిన ఇండియ‌న్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం యూఏఈకి చేరుకుంది. ఇందులో భాగంగా.. భారతీయ మీడియా, వినోద రంగానికి సంబంధించి రణ్‌వీర్‌ సింగ్‌ ప్రాతినిథ్యం వహించాడు.

ఈ సందర్భంగా ‘గ్లోబల్‌ రీచ్‌ ఆఫ్‌ ఇండియన్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ’పై జరిగిన చర్చలో భాగంగా ఈవెంట్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు హీరో రణవీర్‌సింగ్. ఈ త‌రుణంలో ఎక్స్‌పో సందర్శనకు వెళ్లిన కేంద్రమంత్రిని ఈ హీరో రణవీర్‌సింగ్ డ్యాన్స్ చేయమని కోరాడు. దీంతో కాద‌న‌లేక‌.. బాజీరావ్‌ మస్తానీ’ చిత్రంలోని మల్హరీ పాటకు రణ్‌వీర్‌ను అనుకరిస్తూ అనురాగ్‌ ఠాకూర్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌న‌ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

దుబాయ్‌ ఎక్స్‌పోలోని ఇండియన్‌ పెవిలియన్‌ను చూసేందుకు దాదాపు 17 లక్షల మంది తరలివచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. భారత ఎగ్జిబిషన్‌లో యోగా, ఆయుర్వేదం, టూరిజం, టెక్స్‌టైల్, కాస్మిక్ వరల్డ్, సినిమా ప్రపంచంతో సహా భారతీయ ప్రదర్శనలను చూడటానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని మంత్రి ఠాకూర్ చెప్పారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ వినోద, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురితో వరుస చర్చలు జరిపారు. 

అంతేకాకుండా ఎక్స్‌పోలోని యూఏఈ, సౌదీ అరేబియా, ఇటలీ పెవిలియన్స్‌ను కూడా అనురాగ్‌ ఠాకూర్‌ సందర్శించారు. భారతదేశాన్ని ఉపఖండంగా మార్చడమే తన లక్ష్యమనీ, దీని వల్ల భారతదేశంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు సృష్టించవచ్చనీ, ప్రపంచం మొత్తానికి కంటెంట్‌ని సృష్టించడంలో సహాయపడవచ్చని ఠాకూర్ చెప్పారు. ఆరు నెలల పాటు సాగే దుబాయ్‌ ఎక్స్‌పో గత అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఇందులో 192 దేశాలు పాల్గొన్నాయి. భారత్‌లోని 15 రాష్ట్రాలు, 9 కేంద్ర మంత్రిత్వశాఖలు ఈ ఎక్స్‌పోలో భాగమయ్యాయి. ఈ ఎక్స్‌పో ఈ నెల 31తో ముగియనుంది.

Scroll to load tweet…