బెంగళూరు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత కుమార్ కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ సోమవారం తెల్లవారు జామున మరణించారు. 

1996 నుంచి ఆయన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోడీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయనశాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

ఆయనకు భార్య తేజస్విని, ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, విజేత ఉన్నారు. ఆయన మృతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతాపం వ్యక్తం చేశారు.