Asianet News TeluguAsianet News Telugu

పండుగ సీజన్‌లో ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలి: రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

పండుగ సీజన్‌లో కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు సూచించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించాలని తెలిపింది. కరోనా మార్గదర్శకాలను వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
 

union MHA extends coronavirus guidelines till september 30
Author
New Delhi, First Published Aug 28, 2021, 2:23 PM IST

న్యూఢిల్లీ: రానున్న పండుగ సీజన్‌లో కరోనా కేసులు పెరిగే ముప్పు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కరోనా మార్గదర్శకాలను వచ్చే నెల చివరి వరకు పొడిగించింది. పండుగ సీజన్‌లో భారీ వేడుకలు, ఉత్సవాలు జరగకుండా  చూసుకోవాలని, ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఎప్పటిలాగే టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖలో సూచించారు.

జాతీయ స్థాయిలో కరోనా మహమ్మారిపై పరిస్థితులు అదుపులో ఉన్నట్టు కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తున్నదని వివరించారు. కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసులు, హై పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. ఇవే ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. పండుగ సీజన్‌లో ఈ జిల్లాల్లో అవసరమైతే స్థానిక ఆంక్షలు విధించాలని సూచించారు. యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేసుల పెరుగుదలను మొదట్లోనే కనిపెట్టాలని, వెంటనే కట్టడి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios