తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. నిర్మాణంలో వున్న కొత్త ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు వెంటనే తమకు సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు.

అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు అమలు చేయాలని షెకావత్ కోరారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్ర జలవనరుల శాఖ స్పందించింది. ఏపీ, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్ట్‌లకు అనుమతి తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 19 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపించాలని ఏపీని కోరారు షెకావత్.

అలాగే 15 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపించాలని తెలంగాణను కోరారు. ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు ఆమోదించేవరకు నిర్మాణాలు చేపట్టవద్దని షెకావత్ విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌లను వీలైనంత త్వరగా మదింపు చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది.

అయితే ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్‌ కూడా రాలేదని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్‌ ఇవ్వాలని గోదావరి బోర్డును కోరారు. పురుషోత్తమపురం మినహా దేనికీ డీపీఆర్‌ ఇవ్వలేదన్నారు.

కృష్ణాపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని.. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని కోరారు. డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారమువుతుందని షెకావత్ తెలిపారు.