విజృంభిస్తోన్న కరోనా: అమల్లోకి టెస్ట్, ట్రాక్, ట్రీట్ ఫార్ములా.. కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల నియంత్రణకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల నియంత్రణకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్‌టీపీసీఆర్‌ల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇక టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. టెస్టుల సంఖ్యను పెంచి పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేయాలని చెప్పింది. వీలైనంత త్వరగా రోగులకు చికిత్స అందించాలని హోంశాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 715 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 13శాతం మేర తగ్గడం ఊరటనిచ్చే అంశం.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కి (1.6 కోట్లు) చేరింది. మరణాలు 1.6లక్షల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం (మార్చి 23,2021) వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 199 మంది కరోనాకు బలవ్వగా.. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య లక్షా 60వేల 166కి చేరింది. గడిచిన 24 గంటల్లో 29 వేల 785మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.