Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్: తృణమూల్‌పై ‘ఆకర్ష్ ’ అస్త్రం.. రంగంలోకి అమిత్ షా

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ- తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. 

union home minister amit Shah two day visit to west Bengal ksp
Author
Kolkata, First Published Dec 18, 2020, 4:36 PM IST

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ- తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది.

దీనికి తోడు కొద్దిరోజుల క్రితం జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరగడంతో ఇరు వర్గాలు భౌతిక దాడులకు సైతం దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో విజయమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టిన కమలనాథులు..  తృణమూల్ కాంగ్రెస్‌లోని కీలక నేతలను టార్గెట్ చేశారు. 

ఇప్పటికే కీలక నేత సువేందు అధికారితో పాటు మరికొందరు రెబెల్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. అమిత్‌ షా బెంగాల్ పర్యటనలో భాగంగా సువేందు కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయనతో పాటు తృణమూల్‌ నుంచి ఇంకా ఎవరైనా బయటకు వస్తారా అనే విషయం చర్చనీయాంశమయింది. ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల విషయంపై కేంద్ర హోంశాఖకు మమతా బెనర్జీకి మధ్య వివాదం ముదురుతున్న సమయంలోనే అమిత్‌ షా పర్యటన చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, బీజేపీ ఆపరేషన్‌లో భాగంగా రెబల్‌ తృణమూల్‌ నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. తొలుత సువేందు అధికారి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగా, ఆయన వెంటే జితేంద్ర తివారీ, శీల్‌భద్ర దత్తాలు కూడా టీఎంసీని వీడుతున్నట్లు ప్రకటించారు.

అమిత్‌ షా పర్యటనకు ముందే వీరు పార్టీని వీడటం ఆసక్తిగా మారింది. వీరి బాటలోనే మరికొంత మంది తృణమూల్‌ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. శని, ఆదివారాల్లో అమిత్‌ షా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో టీఎంసీ నుంచి వలసలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.

బెంగాల్‌లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రెండు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రాత్రి ఆయన కోల్‌కతా చేరుకుంటారు.

శని, ఆది వారాల్లో పలు ప్రాంతాల్లో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం ఉత్తర కోల్‌కతాలోని స్వామి వివేకానందా భవనాన్ని సందర్శించిన అనంతరం మిడ్నాపూర్‌కు బయలుదేరుతారు.

అక్కడ ఓ రైతు ఇంట్లో బస చేసిన తర్వాత స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆదివారం కూడా రోడ్‌ షోలు నిర్వహించిన అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.  మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో నేతలు చేజారకుండా తృణమూల్ కాంగ్రెస్ అప్రమత్తమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios