దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌ ఆదివారం కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ భేటీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్, ఎస్ఎండీఏ సభ్యులు, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

కాగా శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో ఏకంగా 2,137 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో అక్కడ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 36,824కి చేరుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 1,214 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 13,398 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

కాగా దేశంలో 24 గంటల్లో మరో 7,135 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వారి సంఖ్య 1,54,329కి పెరగ్గా.. ఈ శాతం 49,95గా ఉందని తెలిపింది.