ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పందించారు. ఈడీ డైరెక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదని , ఈ పాత్రలో ఎవరు ఉంటారన్నది కూడా ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడోసారి పొడిగింపు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మాట్లాడుతూ.. ఈడీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషించే వారు భ్రమలు పడవద్దని అన్నారు. ఈడీ అధికారాలు తగ్గలేదని, అవినీతిపై చర్యలు ఆగవని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్దం: సుప్రీం కోర్టు
ఈడీ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయంపై సంబరాలు చేసుకుంటున్న వారు వివిధ కారణాల వల్ల గందరగోళంలో ఉన్నారని అమిత్ షా చురకలంటించారు. దీనికి వారు సంతోషించాల్సిన అవసరం లేదని.. సీవీసీ చట్టంలో సవరణకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిందని అమిత్ షా గుర్తుచేశారు. దానిని కోర్టు సైతం సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. అవినీతిపరులను , చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే పాల్పడేవారిని అణిచివేసేందుకు ఈడీ అధికారాలు అలాగే ఉంటాయన్నారు.
ఈడీ అనేది ఏ వ్యక్తికైనా ఉన్నతమైన సంస్థ అని అమిత్ షా స్పష్టం చేశారు. దీని ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉందన్నారు. మనీలాండరింగ్ , విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన నేరాల విచారణను ఈడీ కొనసాగిస్తూనే వుంటుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈడీ డైరెక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదని , ఈ పాత్రలో ఎవరు ఉంటారన్నది కూడా ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి వ్యతిరేక మనస్తత్వం ఉన్న అవినీతిపరులపై నిరంతరం నిఘా ఉంచుతామని కేంద్ర హోంమంత్రి తఅన్నారు.
