జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పౌరులను టార్గెట్ చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.  

జమ్మూకశ్మీర్‌లో (Jammu kashmir) ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సైన్యాన్ని , పోలీసులను కాకుండా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం ఓ బ్యాంకు మేనేజర్‌ను (bank manager) హతమార్చగా.. ఇటీవలే ఓ స్కూలు టీచర్‌ను పొట్టనబెట్టుకున్నారు. గడిచిన కొద్దిరోజుల నుంచి ఎనిమిది మందిని బలితీసుకున్నారు. వరుస సంఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 

ఈ ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) వరుస సమావేశాలతో జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించే ఉగ్రవాదుల నయా వ్యూహాన్ని అడ్డుకోవడంపైనే ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఇదే అంశంపై రేపు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కాగా.. రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లా అరె మోహన్‌పొరాలోని ఇల్లాఖీ దెహతి బ్యాంక్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బ్యాంకుకు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. 

షోపియన్‌లో ఈ రోజు జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలోనే బ్యాంక్ మేనేజర్‌ హత్య జరిగింది. ఇక .. ఇదే దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితమే హిందూ మహిళను ఉగ్రవాదులు చంపారు. రజ్నీ బాలా అనే కశ్మీరీ పండిట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. భర్త, కుమార్తెలతో ఆమె సాంబాలో నివసించేవారు. కానీ, ఈ మహిళా ఉపాధ్యాయురాలిని రెండు రోజుల క్రితమే ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

గతవారం టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కర్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 12వ తేదీన రెవెన్యూ డిపార్ట్‌మెంటు‌లో పని చేస్తున్న రాహుల్ భట్‌నూ ఉగ్రవాదులు కాల్చి చంపేసిన ఘటన తెలిసిందే. కొన్నాళ్లుగా జమ్ము కశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడుతున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.