Asianet News TeluguAsianet News Telugu

ఓటు బ్యాంకు రాజకీయాలంటూ జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు

Ranchi: జార్ఖండ్‌లో గిరిజనుల భూములు లాక్కుంటున్నార‌నీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ తన బాధ్యతను నెరవేర్చడం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్నారు.
 

Union Home Minister Amit Shah criticizes Jharkhand CM Hemant Soren as vote bank politics
Author
First Published Jan 7, 2023, 5:04 PM IST

Union Home Minister Amit Shah: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుడు అయిన‌ప్ప‌టికీ, ఈ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని అన్నారు. వారి పదవీకాలంలో, అవినీతి గరిష్ట స్థాయికి చేరుకుంద‌ని ఆరోపించారు. మ‌ధ్యవర్తులు, గిరిజన భూములను కబ్జా చేస్తున్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం (జనవరి 7) జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసాలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శలు గుప్పించారు. “జార్ఖండ్‌లో గిరిజనుల భూకబ్జాదారులు చురుకుగా ఉన్నారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ తన బాధ్యతలేవీ నిర్వర్తించడం లేదు. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు చేస్తున్న పనిని ఇక్క‌డి ప్ర‌జ‌లు క్షమించరు" అని అమిత్ షా ఆరోపించారు. 

మీ పాల‌న‌లో జార్ఖండ్ నాశనం.. 

ప్ర‌స్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల‌న కార‌ణంగా జార్ఖండ్ నాశ‌నమైంద‌ని అన్నారు. విద్య, రోడ్డు, విద్యుత్‌ వంటి అన్ని రంగాల్లో మేం పనిచేశామని పేర్కొన్న అమిత్ షా.. త‌మ తర్వాత వచ్చిన ప్రభుత్వం జార్ఖండ్‌ను నాశనం చేసిందని విమ‌ర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వతహాగా గిరిజనుడే అయినా ప్రభుత్వం గిరిజన వ్యతిరేకిగా న‌డుస్తున్న‌ద‌ని ఆరోపించారు. నేడు జార్ఖండ్‌లో గిరిజన మహిళలకు బలవంతంగా పెళ్లిళ్లు చేసి వారి భూములను లాక్కుంటున్నారన్నారు. జార్ఖండ్ ప్రజలు మేల్కొన్నార‌నీ, ఇప్పుడు ఈ అన్యాయాన్ని సహించేది లేదని పేర్కొన్నారు. 

మీ వాగ్దానాలు ఏమ‌య్యాయి..? 

జార్ఖండ్‌లో యువతను, తల్లులను, సోదరీమణులను మోసం చేసే పని జరుగుతోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. తిండి, ఉపాధి, విద్య పేరుతో మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చే ధైర్యం లేకుంటే కుర్చీ ఖాళీ చేయండి.. జార్ఖండ్‌లో ఉద్యోగాలు ఇచ్చే పని బీజేపీ చేస్తుందన్నారు. అంతే కాకుండా ప్రధాని మోడీ పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకోదని అన్నారు. ఇక్కడ భూకబ్జా అనే ఘోర పాపం జరుగుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడతాం. ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని అన్నారు.  

సీఎం హేమంత్ సోరెన్ కు ప్ర‌శ్న‌లు.. 

ఇక్క‌డి ప్ర‌జ‌ల కోసం హేమంత్ సోరెన్ ఏం చేశారో చెప్పాల‌ని అమిత్ షా ప్ర‌శ్నించారు. తాను అభివృద్ధి పనులకు సంబంధించిన పెద్ద జాబితానే తీసుకొచ్చానని చెప్పిన ఆయ‌న‌.. సీఎం హేమంత్ సోరెన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా గిరిజనుల ప్రయోజనాల కోసం ఏం చేశారో చెప్పాల‌ని అన్నారు. ఈసారి జార్ఖండ్ ప్రజలు మార్పు తీసుకురాబోతున్నారని, ఇక్కడి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని మార్చబోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పైన కూడా  ఆయన విమర్శలు గుప్పించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios