Asianet News TeluguAsianet News Telugu

జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సంచలన హామీ.. పహాడీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటన

జమ్ము కశ్మీర్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. పహాడీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. జస్టిస్ శర్మ కమిషన్ ఇందుకు ప్రతిపాదనలు చేసిందని, మోడీ ప్రభుత్వం వీటిని సమీప భవిష్యత్‌లోనే అమలు చేస్తుందని వివరించారు.

union home minister amit shah announces reservation for paharis
Author
First Published Oct 4, 2022, 3:32 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఆయన రజౌరీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో పహాడీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. పహాడీలతోపాటు గుజ్జార్, బకర్వాల్ కమ్యూనిటీలకూ రిజర్వేషన్ ఇస్తామని పేర్కొన్నారు.

పహాడీలకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలని జస్టిస్ శర్మ సిఫార్సు చేశారని రజౌరీలోని మెగా ర్యాలీని ఉద్దేశిస్తూ హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ఈ సిఫార్సులను అమలు చేస్తారని తెలిపారు. పహాడీలు, గుజ్జార్లు, బకర్వాలు గతంలో వివక్ష ఎదుర్కొన్నారని అన్నారు. వారు రిజర్వేషన్ పొందలేని చెప్పారు. గుజ్జార్లు, బకర్వాల పై పహాడీల రిజర్వేషన్లు దుష్ప్రభావం చూపిస్తాయా? అనే అంశాన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. అలాంటివేమీ జరగదని భరోసా ఇచ్చారు. గుజ్జార్లు, బకర్వాలు జమ్ము కశ్మీర్‌లో ఎస్టీ హోదాలో ఉన్నారు.

తీవ్రవాదంపై పోరులో పహడీలు, గుజ్జార్లు, బకర్వాలు బలంగా నిలబడ్డారని, అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.

ఇదే సందర్భంలో జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ ఆర్టికల్ 370ని నీరుగార్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370, 35ఏలను తొలగించిందని ఆయన తెలిపారు. ఒక వేళ ఆర్టికల్ 370, 35ఏలను తొలగించకుంటే ఎస్టీ కమ్యూనిటీలు రాజకీయ రిజర్వేషన్‌ను పొందేవా? ఇప్పుడు పహాడీలు, ఇతర వర్గాలు కూడా తమ హక్కులను పొందుతాయని చెప్పారు.

ఆర్టికల్ 370, 35ఏలను తొలగించి ప్రజాస్వామ్యానికి క్షేత్రస్థాయిలో తేగలిగాం అని పేర్కొన్నారు. ఈ లోయలో ఉగ్రవాదులపై విరుచుకుపడటానికి కూడా స్థానికులు ఎంతో సహాయం చేశారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం చర్యల కారణంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య భారీ గా తగ్గిందని తెలిపారు. గతంలో ఏడాదికి భద్రతా బలగాల సిబ్బంది సుమారు 1,200 మంది చనిపోయేవారని, ఇప్పుడు ఇది 136కు తగ్గిందని వివరించారు. 

జమ్ము కశ్మీర్‌ను కేవలం మూడు కుటుంబాలే పాలించాయని.. కానీ, ఇప్పుడు ఎన్నికైన సుమారు 30 వేల మంది పంచాయత్ అధికారులు, జిల్లా కౌన్సిల్స్ సిబ్బంది పాలిస్తున్నారని వివరించారు.

అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఈ సర్వీస్‌ను దుర్వినియోగం చేసి లా అండర్ ఆర్డర్ దిగజార్చే ముప్పు ఉన్నదని ఓ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios