న్యూఢిల్లీ: కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం నాడు  పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. హర్యానా, పంజాబ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ , ఒడిశా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్  డ్రైవ్ తదితర అంశాలపై  మంత్రి సమీక్షించారు. 

దేశంలోని  18 రాష్ట్రాల్లో క్రమంగా కేసులు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులను ఆయన  అధికారులతో చర్చించారు. దేశంలోని 90 శాతం ప్రాంతాల్లో అత్యధికంగా పాజిటివీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటును తగ్గించే మార్గాలకు సంబంధించి కేంద్ర మంత్రి రాష్ట్రాలతో చర్చించారు. ఇదిలా ఉంటే భారత్ స్ట్రెయిన్  44 దేశాల్లో వ్యాప్తి చెందిందని డబ్ల్యుహెచ్ఓ చెప్పలేదని కేంద్రం తేల్చి చెప్పింది. డబ్ల్యు హెచ్ఓ నివేదికలో ఈ విషయం లేదని  కేంద్రం స్పష్టం చేసింది.