కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను భారత ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా వివిధ రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోంది. తాజాగా బుధవారం అన్‌లాక్ 3 మార్గదర్శాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.

ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల మూసివేతపై యథావిధిగా నిషేధం కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఆగస్టు 5 నుంచి జిమ్‌లు తెరుచుకోనున్నాయి. 

భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చునని పేర్కొంది. ఎట్ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లదే తుది నిర్ణయమని ప్రకటించింది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటి వాటిపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.

సామాజిక, రాజకీయ, క్రీడా , వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం ఉంటుందని వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.