న్యూఢిల్లీ:  60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు ప్రతి నెల రూ. 3 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్టు  కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

అసంఘటిత కార్మికులు ప్రతి నెల రూ.100 చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.3 వేల చొప్పున పెన్షన్  అందించనున్నట్టు చెప్పారు.  అసంఘటిత  రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది.

 మరోవైపు గ్రాట్యూటీ పరిమితిని 30 లక్షలకు పెంచింది.  ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10 లక్షలు మాత్రమే ఉంది. దీన్ని రూ30 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.  కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరించనున్నట్టు పీయూష్ ప్రకటించారు.  పెన్షన్‌లో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచనున్నారు.  కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలను  అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఈపీఎప్ఓ సభ్యుల సంఖ్య రెండేళ్లలో రెండు కోట్లకు పెరిగినట్టు కేంద్రం ప్రకటించింది. కార్మికుల ప్రమాద భీమాను రూ.1.50 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.