రాజ్యసభలో ఇవాళ విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆదివారం సాయంత్రం తన తోటి కేంద్ర మంత్రులతో కలిసి మీడియా ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ఈ ఘటన దురదృష్టకరమని, సిగ్గు చేటన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రవర్తన సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను బాధపెడుతుందంటే ఎప్పటికీ నమ్మకూడదని రాజ్‌నాథ్ సూచించారు.

తాను కూడా రైతునేన్న ఆయన కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలకు ముగింపు పలికే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై నేను వ్యాఖ్యానించనని రాజ్‌నాథ్ వెల్లడించారు.

ఏదైనా అంశంపై సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం అధికారపార్టీ బాధ్యతని, దానిని ప్రతిపక్షాలు గౌరవించాలని రక్షణ మంత్రి హితవు పలికారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌పై ప్రతిపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.