ఢిల్లీ: అన్నదాతను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంలో కొత్త పథకం ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ అభియాన్‌(పీఎం ఆశ)కు ఆమోదముద్ర వేసింది. అలాగే ఇథనాల్‌ ధరను రూ.47.49 నుంచి రూ.52.43కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

2021-22 నాటికి అన్ని బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గాలను వందశాతం విద్యుద్దీకరించాలని కేబినేట్ నిర్ణయించింది. దేశంలో నాలుగు ఎన్‌ఐడీలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం విజయవాడ, జోర్‌హాట్‌, భోపాల్‌, కురుక్షేత్రలో ఎన్‌ఐడీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో విజయవాడలో ఎన్‌ఐడీకి శంకుస్థాపన చేసిన కేంద్రం ప్రభుత్వం అమరావతి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌కు జాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థగా గుర్తింపునిచ్చింది. ఎన్‌ఐడీ పేరును ఎన్‌ఐడీ అమరావతిగా మార్పు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.