ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఉచిత వ్యాక్సిన్, ఆర్ధిక వ్యవస్థపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొంది. అలాగే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధర పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

2021 సంవత్సరానికిగాను 100 రోజుల ఛాలెంజ్‌ పేరుతో రాష్ట్రాలకు పీఎంఏవై-యూ అవార్డులు కేంద్రం ప్రధానం చేయనుంది. ఇక ఇప్పటివరకు మంజూరు చేసిన 1.12 కోట్ల గృహాలలో 82.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడించింది. ఇకపై రాష్ట్రాలు టీకా కోసం పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని సోమవారం ప్రధాని మోడీ జాతినుద్దేశిస్తూ ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో సార్వత్రిక వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. 

Also Read:ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌.. జేబుకు చిల్లే : కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ విల ధరలు ఇవే..!!

దీనిలో భాగంగా 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్‌ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల కోసం మంగళవారం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 25 కోట్లు, భారత్‌ బయోటెక్‌‌కు 19 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు వెల్లడించింది.