లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఆటోమేటిక్ రూట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (foreign direct investment) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఆటోమేటిక్ రూట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (foreign direct investment) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థకు పెట్టుబడుల ఉపసంహరణను సులభతరం చేసే లక్ష్యంతో LICలో ఆటోమేటిక్ రూట్‌లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కేంద్ర మంత్రివర్గం శనివారం అనుమతినిచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎఫ్‌డీఐ సీలింగ్ 20 శాతంగా ఉండగా.. ఎల్‌ఐసీకి కూడా ఇదే పరిమితిని కొనసాగించారు. అయితే ఆటోమేటిక్ రూట్ ఎంపిక మూలధన సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎల్‌ఐసీ ఐపీ‌ఓలో విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపిందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

ఇక, కేంద్ర ప్రభుత్వం మొత్తం 63 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో.. 5 శాతం వాటాకు సమానమైన రూ. 10 ముఖ విలువ కలిగిన 31.6 కోట్లకు ఈక్విటీ షేర్లను ఎల్‌ఐసీలో విక్రయించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం సెబీ దాఖలు చేసింది. ఇక, మార్చిలో ఎల్‌ఐసీ ఐపీవోకు వచ్చే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఈ ఐపీవోలో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.