పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత్రి పుదుచ్చేరి అసెంబ్లీని రద్దు చేశారు . నారాయణ స్వామి సర్కార్ బలపరీక్షలో ఓడిపోవడంతో రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసు చేశారు. ఎల్జీ సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇక రాష్ట్రపతి నిర్ణయమే తరువాయిగా వుంది. త్వరలో పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

మంగళవారం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. నిన్న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించగా.. సంఖ్యాబలం లేకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు వెళ్లిన ఆయన రాజీనామా లేఖను ఎల్జీకి ఇచ్చారు.

కాగా, ఇటీవల కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.

సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవ్వగా మరో ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. విశ్వాస పరీక్షలో విఫలమవ్వడంతో నారాయణ స్వామి రాజీనామా చేశారు.