కేంద్రప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా ప్రతిఏటా అందించే 78 రోజుల బోనస్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

ఈ నిర్ణయం కారణంగా రైల్వే బోర్డుపై రూ.2024.40 కోట్ల భారం పడనుంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టవిటీ లింక్డ్ బోనస్ అందించడం ఇది వరుసగా ఆరో ఏడాది. నాన్ గెజిట్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.

కాగా బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో క నుంచి ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఈ-సిగరెట్లు యువతపై దుష్ప్రభావాన్ని చూపెడుతోందని.. ఇదే సమయంలో తాము సాధారణ సిగరెట్లను ప్రోత్సహించడం లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. పొగాకు వినియోగం తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయమని నిర్మల వెల్లడించారు.