న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణమరాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఝలక్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణమ రాజు ప్రశంసించారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి చూపారని విజయసాయి రెడ్డి తప్పు పట్టారు.

అయితే, కేంద్ర బడ్జెట్ ను రఘురామకృష్ణమరాజు ప్రశంసిస్తూనే క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకుంటామని చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ బాగుందని ఆయన అన్నారు. వ్యవసాయం, తాగునీటికి పెద్ద యెత్తున నిధులు కేటాయించడం సంతోషకరమని అన్నారు. 

Also Read: ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

ఆక్వా రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారని, తమ నియోజకవర్గంలో పెద్ద యెత్తున అక్వా కల్చర్ ఉందని, అందువల్ల తమ నియోజకవర్గానికి అది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఏపీకి న్యాయం జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేస్ వేర్వేరు అంశాలని ఆయన అన్నారు. కేంద్ర మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామని చెప్పారు. 

బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే బీమాను రూ.5 లక్షలకు పెంచడం సామాన్యూలకు ఇచ్చిన బహుమతి అని అన్నారు. బడ్జెట్ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ చాలా బాగుందని ఆయన కొనియాడారు.